Thu23052013

Last updateThu, 23 May 2013 9pm

Back You are here: Home న్యూస్ బిట్స్ న్యూస్ రాష్ట్రీయం ఆపరేషన్ "టార్చ్"!

ఆపరేషన్ "టార్చ్"!

ఆపరేషన్ థియేటర్‌లో స్ట్రెచర్‌పై కనిపిస్తున్న ఈమె పేరు అనంతమ్మ. ఊరు రంగారెడ్డి జిల్లా ధారూరు మండలం కేరెళ్లి గ్రామం. కొంత కాలంగా కడుపు నొప్పితో బాధపడుతోంది. గర్భసంచిని తొలగించేందుకు ఆపరేషన్ కోసం మంగళవారం ఆస్పత్రికి వచ్చింది. ఆపరేషన్ థియేటర్‌లో అనస్తీషియా డాక్టర్ మత్తు ఇంజెక్షన్ ఇచ్చి స్ట్రెచర్‌పై పడుకోబెట్టారు. ఆపరేషన్‌కు అంతా సిద్ధం చేశారు. ఇంతలో కరెంట్ పోయింది. ఎప్పుడు వస్తుందో తెలియదు. ఆస్పత్రి జనరేటర్ ఇన్‌చార్జిని సూపరింటెండెంట్ పిలిచా రు. డీజిల్ తెప్పించాలని ఆదేశించారు. జనరేటర్ ఇన్‌చార్జి పెట్రోల్ బంకు నుంచి డీజిల్ తేవటానికి వెళ్లాడు. అప్పటిదాకా అనంతమ్మ స్ట్రెచర్‌పై అలాగే ఉంది. డీజిల్ తెచ్చి జనరేటర్ ఆన్ చేశాక ఆపరేషన్ చేశారు.

విశాఖ జిల్లా అచ్యుతాపురం పీహెచ్‌సీలో విద్యుత్ కోత సమస్య ఓ బాలింత ప్రాణం మీదకు తీసుకొచ్చింది. మంగళవారం ఉదయం పూడిమడకకు చెందిన మైలపల్లి చిలుకమ్మ అనే నెలలు నిండిన గర్భిణిని తీసుకొచ్చారు. బిడ్డ అడ్డం తిరగటంతో వైద్యాధికారి మెహతాజీ అతికష్టం మీద బిడ్డను బయటికి తీశారు. అనంతరం వార్మర్ యంత్రంలో బిడ్డను ఉంచారు. కానీ విద్యుత్ సరఫరా లేకపోవటంతో వార్మర్ పనిచేయలేదు. దీంతో తల్లీబిడ్డలను హుటాహుటిన అనకాపల్లికి తరలించారు. అచ్యుతాపురం పీహెచ్‌సీలోని జనరేటర్ ఏడాదిగా పనిచేయటం లేదు. ప్రసూతి వార్డులో ఫ్యాన్లు తిరగక గర్భిణులు, బాలింతలు నానా అవస్థలు పడుతున్నారు.

కరీంనగర్ జిల్లా మహదేవపూర్ మండలం పలిమెలకు చెందిన పెందెర మమత సోమవారం రాత్రి పురిటినొప్పులతో మండల కేంద్రంలోని పీహెచ్‌సీకి చేరింది. ప్రసవం అయిన కొద్దిసేపటికే కరెంట్ పోయింది. తదుపరి సేవలను క్యాండిల్, చార్జింగ్ లైట్ల వెలుతురులో పూర్తి చేశారు.

రాష్ట్రంలో అమలు చేస్తున్న విద్యుత్ కోతలు ప్రభుత్వాస్పత్రుల్లో రోగులకు నరకం చవిచూపిస్తున్నాయి. ఆపరేషన్ థియేటర్లు, వైద్య పరీక్షల ల్యాబుల్లో చీకట్లు అలుముకుంటున్నాయి. ఏవైనా అత్యవసర కేసులు వస్తే చాలాచోట్ల కొవ్వొత్తుల వెలుగులోనే ఆపరేషన్లు చేయాల్సి వస్తోంది. చిన్నపిల్లల వార్డుల్లో ఫొటో థెరపీ, ఇంక్యుబేటర్లుపై వైద్యం అందించటం కూడా గగనమవుతోంది. దీంతో పురిటిపిల్లలు సైతం మృత్యువుతో పోరాడుతున్న దుస్థితి. రోజూ గంటల తరబడి కోత విధిస్తుండటంతో ఆస్పత్రుల్లోని రిఫ్రిజిరేటర్లు, కూలర్లు పనిచేయటం లేదు. వాటిలో నిల్వ ఉంచిన పోలియో, కోరింతదగ్గు, ధనుర్వాతం, క్షయ, దవడవాపు వ్యాక్సిన్లతో పాటు.. కుక్కకాటు, పాము కాటు మందులు, రక్తపు బ్యాగులు వంటి ఔషధాలూ చెడిపోతున్నాయి. అసలే మందులు, ఔషధాల సరఫరా అంతంత మాత్రంగా ఉంటే.. ఉన్నవి కూడా పాడైపోతుండటం ఆందోళన కలిగిస్తోంది. కేవలం ఆపరేషన్లు చేసే ఆస్పత్రులకు జనరేటర్లు ఉన్నా.. చాలాచోట్ల వాటి ఇంధనానికి సరిపడా నిధులు ఇవ్వకపోవటంతో అలంకారప్రాయంగా మిగులుతున్నాయి. కరెంటు కోతలు తీవ్రంగా ఉండటంతో ఇన్వర్టర్లు కూడా పనిచేయటం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా ఆస్పత్రులు, ఏరియా ఆస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కరెంటు కోతల ప్రభావాన్ని మంగళవారం ‘సాక్షి’ పరిశీలించినప్పుడు.. అన్ని చోట్లా ఈ దయనీయ పరిస్థితులే కనిపించాయి. ప్రభుత్వాస్పత్రుల్లో అరకొరగా వైద్యం మాత్రమే అందుతోంది. కరెంటు కోతల కారణంగా చికిత్స అందించలేమని, ఆపరేషన్లు చేయలేమని చెప్తూ.. రోగులు ప్రయివేటు ఆస్పత్రులకు వెళ్లాల్సిందిగా కొన్నిచోట్ల వైద్యులే సిఫారసు చేస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో సర్కారు దవాఖానాలనే నమ్ముకున్న నిరుపేద రోగులకు దిక్కుతోచటం లేదు.

అక్కడ జనరేటర్లు అలంకారప్రాయం...

చిత్తూరు జిల్లాలో 94 ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లోనూ జనరేటర్లు ఉన్నాయి. కానీ.. ఒకటి రెండు చోట్ల మినహా జనరేటర్లు వాడుతున్న దాఖలాలు లేవు. మరి కొన్ని మరమ్మతులకు నోచుకోక మూలనపడి ఉన్నాయి. జనరేటర్లను వాడాలంటే డీజిల్ కావాలని, అందుకు ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించలేదని వైద్యాధికారులు చెపుతున్నారు. కరెంటు కోతల కారణంగా ఉన్న జనరేటర్లన్నిటినీ వాడాల్సి వస్తే రూ. 2 లక్షలకు పైగా నిధులు అవసరమని అధికారులు చెప్తున్నారు. ఇన్వర్టర్లు కొనుగోలు చేయాలని పీహెచ్‌సీలకు ఆదేశాలు జారీ చేసినా.. అనేక చోట్ల నిధులు లేక వాటిని కొనలేదు. దీంతో అత్యవసర చికిత్సల కోసం ఆస్పత్రులకు వచ్చిన రోగులను వైద్యులు తిప్పి పంపేస్తున్నట్లు ఏర్పేడు మండలానికి చెందిన మహిళ ఆందోళన వ్యక్తం చేసింది.

బిల్లు కట్టలేదని కరెంటే కట్ చేశారు..!

కర్నూలు జిల్లాలోని పీహెచ్‌సీల్లో కరెంటు కోత కారణంగా రాత్రి వేళల్లో విధులు నిర్వహించేందుకు నర్సులు రావటం లేదు. దీంతో వైద్యం కోసం రోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. దీనికితోడు బిల్లులు చెల్లించడం లేదంటూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు విద్యుత్‌శాఖ విద్యుత్ సరఫరాను నిలిపేసింది. జిల్లాలోని ఆరోగ్య కేంద్రాలు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయానికి కలిపి విద్యుత్ శాఖకు రూ. 46 లక్షలకు పైగా బకాయి ఉంది. ఈ మొత్తాన్ని చెల్లించేందుకు నిధులు లేక, ప్రభుత్వం విడుదల చేయక జిల్లా అధికారులు చేతులెత్తేశారు. ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధుల కోరిక మేరకు కొన్ని ఆరోగ్య కేంద్రాలకు విద్యుత్ సరఫరా పునరుద్ధరించారు. నేటికీ 18 ఆరోగ్య కేంద్రాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.

ఇక్కడ పీహెచ్‌సీల్లో జనరేటర్లే లేవు...

వైఎస్సార్ జిల్లాలోని పీహెచ్‌సీల్లో ఒక్క జనరేటర్ కూడా లేదు. రిమ్స్ (రాజీవ్‌గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్)లో జనరేటర్ ఉంది. కానీ డీజిల్‌కు తగినన్ని నిధులు కేటాయించటం లేదు. రిమ్స్, ఏరియా ఆస్పత్రుల్లో రోజుకు సగటున 40 ఆపరేషన్లు చేస్తారు. విద్యుత్ కోతల వల్ల ఈ సంఖ్య 10కి తగ్గింది. తక్కిన 30 మందికి కరెంట్ ఉన్న సమయాల్లో ఆపరేషన్లు చేయడం, లేదంటే ప్రైవేటు క్లినిక్‌లకు తీసుకెళ్లమని డాక్టర్లే సిఫారసు చేయటం జరుగుతోంది.

అత్యవసర వైద్య సేవలు బంద్

పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురం సామాజిక ఆరోగ్య కేంద్రం.. చుట్టుపక్కల ఐదు పీహెచ్‌సీలకు కేంద్రం. ప్రతి రోజూ 120 మంది వరకూ రోగులు వస్తుంటారు. ఆస్పత్రిలో 20 మంది ఇన్‌పేషెంట్లు ఉంటారు. కానీ కరెంటు కోతలతో ఇక్కడ అత్యవసర సేవలు నిలిచిపోయాయి. పురిటి కోసం వచ్చిన గర్భిణులను, శస్త్రచికిత్సలు అవసరమైన వారిని జంగారెడ్డిగూడెం, కొవ్వూరు ఏరియా ఆస్పత్రులకు పంపిస్తున్నారు. శిశువులకు ఏర్పాటు చేయవలసిన ఆటోమెటిక్ హీటర్ కరెంట్ లేక పనిచేయటం లేదు. జనరేటర్, ఇన్వర్టర్ నిర్వహణ భారంగా మారటంతో ఏడాది కాలంగా మూలపడ్డారుు.

ఆపరేషన్లు పూర్తయ్యాక జనరేటర్ బంద్

నల్లగొండ జిల్లా నకిరేకల్ పట్టణంలో మంగళవారం మధ్యాహ్నం ఒంటిగంట నుంచి సాయంత్రం ఐదుగంటల వరకు విద్యుత్ కోత విధించారు. ఇదే రోజు పట్టణంలోని 30 పడకల ప్రభుత్వాస్పత్రికి 69 మంది మహిళలు కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సల కోసం వచ్చారు. వారందరికీ మధ్యాహ్నం రెండు గంటల నుంచి జనరేటర్ ద్వారా శస్త్రచికిత్సలు మొదలుపెట్టారు. గంటలోగా అవి పూర్తికాగానే జనరేటర్‌ను నిలిపేశారు. అప్పటి నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఇటు కరెంటు లేక, అటు జనరేటర్ లేక ఆపరేషన్ చేయించుకున్న మహిళలు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరయ్యారు. నర్సంపేట ఆస్పతిలో రజని అనే మహిళకు కాన్పు చేసేందుకు మంగళవారం ఉదయుం 8 గంటలకు ఆపరేషన్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తుండగా కరెంట్ పోరుుంది. వుధ్యాహ్నం 12 గంటల వరకు కరెంట్ రాలేదు. దీంతో నాలుగు గంటల పాటు తన కూతురు నరకయాతన అనుభవించిందని రజిని తల్లి సాంబలక్ష్మి వాపోయింది.

చెట్ల కింద వైద్యం...

ఖమ్మం జిల్లాలోని 29 ఏజెన్సీ మండలాల్లో కరెంట్ కోతల పుణ్యమా అని అస్పత్రుల్లో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు నిలిచిపోయాయి. రాత్రింబవళ్లు తేడాలేకుండా కోతలు విధిస్తుండటంతో తిరగని ఫ్యాన్లు, వెలుగని లైట్లతో ఉక్కపోత.. దోమల మోతతో రోగులు నరకయాతన పడుతున్నారు. గిరిజన ప్రాంతాలైన చింతూరు, వీర్‌పురం, కుక్కునూరు, గుండాల, అశ్వాపురం, వాజేడు, చర్ల మండలాల్లోని ఆస్పత్రుల్లో జనరేటర్లు పనిచేయటంలేదు. పాలేరు నియోజకవర్గంలోని నేలకొండపల్లి, కూసుమంచి, మధిర నియోజకవర్గంలోని ఆస్పత్రుల్లో జనరేటర్ల మరమ్మతులకు డబ్బులు లేవని మూలనపడేశారు. ఆస్పత్రుల్లో వేడిమి తట్టుకోలేక ఉక్కపోతలు, దుర్వాసనలు తట్టుకోలేక ఆస్పత్రి ఆవరణలోని చెట్ల కింద రోగులుసెలైన్ పెట్టించుకుంటున్నారు.
టార్చిలైట్ల వెలుగులో శస్త్రచికిత్సలు

ప్రకాశం జిల్లా ఒంగోలులోని రిమ్స్ హాస్పిటల్‌కు 320 కేవీ జనరేటర్ ఉన్నప్పటికీ నిధుల లేమితో నిరుపయోగంగా మారింది. ఎలక్ట్రానిక్ బీపీ ఆపరేటస్ పనిచేయడం లేదు. ఉలవపాడు, గిద్దలూరు ఆస్పత్రుల్లో టార్చ్‌లైట్ సాయంతో కుటుంబ సంక్షేమ శస్త్ర చికిత్సలు చేస్తున్నారు. చీరాలలోని 100 పడకల ఆస్పత్రిలో పది రోజుల నుంచి జనరేటర్ పనిచేయటం లేదు. పరుచూరులోని 30 పడకల ఆస్పత్రిలో ఫ్యూజ్ బాక్స్ ఏడు నెలల క్రితం కాలిపోయింది. ప్రసవాలు, ట్యూబెక్టమీ ఆపరేషన్లను సమీపంలోని పీహెచ్‌సీలకు రిఫర్ చేస్తున్నారు.

ఫ్యాన్లు లేక పసిపిల్లల నరకయాతన

శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా నెల్లూరు నగరంలోని రేబాల చిన్న పిల్లల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులు.. కరెంట్ కోతతో ఫ్యాన్లు తిరగక గుక్కపెడుతున్నారు. వారిని నిద్రపుచ్చేందుకు తల్లులు పడరాని పాట్లు పడుతున్నారు. ఈ ఆస్పత్రికి నిత్యం దాదాపు 300 మంది చిన్నారులను తల్లిదండ్రులు తీసుకొస్తుంటారు. కరెంట్ లేకపోవడంతో ఎక్స్‌రే తీయలేకపోతున్నారు. ఆస్పత్రికి జనరేటర్ సౌకర్యమున్నా ఉపయోగించటం లేదు.


వ్యాక్సిన్లు వికటిస్తున్నాయి...

గుంటూరు జిల్లాలో 84 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కరెంటు కోతలు రోగులను ఇక్కట్ల పాలుచేస్తున్నాయి. బాపట్ల ఏరియా వైద్యశాలలో స్కానింగ్, రక్తపరీక్షలకు రోగులు రోజుల తరబడి పడిగాపులు పడుతున్నారు. చిలకలూరిపేటలో లింక్ ఏఆర్‌టీ సెంటర్‌లో హెచ్‌ఐవీ వ్యాధినిర్ధారణకు వాడే కిట్‌లు భద్రపరిచేందుకు ఏసీలు పనిచేయకపోవటంతో.. కిట్స్ నిరుపయోగమౌతున్నాయి. మంగళగిరిలో కరెంటు కోతల కారణంగా.. డీప్ ఫ్రిజ్‌లోని వ్యాక్సిన్లు వికటిస్తాయని ఆస్పత్రి వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. తెనాలి జిల్లా ఆస్పత్రిలో డీజిల్‌కు నెలకు కేవలం మూడు వేల రూపాయలు మాత్రమే వినియోగించుకునే అవకాశం ఉంది. కానీ.. జనరేటర్‌కు డీజిల్ ఖర్చు నెలకు సుమారు రు. 40 వేల వరకు అవుతుండటంతో పూర్తి స్థాయిలో వినియోగించలేని పరిస్థితి. కృష్ణా జిల్లాలోని పీహెచ్‌సీలు, ప్రభుత్వాస్పత్రుల్లో గంటల తరబడి విద్యుత్ కోతలు విధిస్తుండటంతో చిన్నారులకు టీకాలు వేసేందుకు తెచ్చిన వ్యాక్సిన్లు పాడైపోతున్నాయి. కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు, ప్రసవాలు చేసే సమయంలో మాత్రమే జనరేటర్లను ఉపయోగిస్తున్నారు. తిరువూరు ఏరియా ఆస్పత్రిలో ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు విద్యుత్‌కోత విధిస్తున్నారు. ఈ పీహెచ్‌సీలో 50 మంది వరకు ఇన్‌పేషెంట్లు ఉన్నారు. విద్యుత్ లేకపోవటంతో ఫ్యాన్లు తిరగక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

తూర్పుగోదావరి జిల్లా కె.గంగవరం మండలం పామర్రు పీహెచ్‌సీలో జనరేటర్ సదుపాయం ఉన్నా డీజిల్‌కు నిధులు మంజూరు కాకపోవటంతో నిరుపయోగంగా ఉంది. ఇన్వర్టరు రెండు మూడు గంటలు మాత్రమే ఉపయోగపడుతోంది. పీహెచ్‌సీ గదుల్లో ఫ్యాన్లు తిరగపోవటంతో ఆరు బయటే కూర్చుంటున్నారు. రోగులకు సెలైన్‌లు సైతం ఆరుబయటే పెడుతున్నారు. పీహెచ్‌సీకి గతంలో రోజుకు 50 నుంచి 70 మంది రోగులు రాగా ప్రస్తుతం పదుల్లో మాత్రమే వస్తున్నారు. ఇన్‌పేషెంట్లు అసలు ఉండడంలేదు.

AddThis Social Bookmark Button

Law Point

JA Teline IV
Friday @ 9PM

Praja Prasthanam

JA Teline IV
@ 9.30AM

The Prime Time Show

JA Teline IV
Mon to Thu @ 9PM

Ding Dong

JA Teline IV
wed & Sat @ 8.30PM

Bhavita

JA Teline IV
Sunday @ 9.30AM