హైదరాబాద్కు మళ్లీ టెర్రర్...!
- Details
- Category: రాష్ట్రీయం
-
06 Mar 2013
- Published on Wednesday, 06 March 2013 10:07
ఉగ్రవాదులు మళ్లీ హైదరాబాద్ లక్ష్యంగా దాడులకు పాల్పడనున్నారనే ఇంటెలిజెన్స్ వర్గాల హెచ్చరికల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తం అయ్యారు. ముష్కర మూకలు మరోసారి విధ్వంసానికి తెగిపడే అవకాశముందని రాష్ట్రానికి కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. 48 గంటలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
ఇంటెలిజెన్స్ హెచ్చరికల నేపథ్యంలో భాగ్యనగరంలో పోలీసులు అప్రమత్తమై భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పలుచోట్ల విస్తృత తనిఖీలు చేపట్టారు. రోడ్లపై, లాడ్జీల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. అనుమానిత వ్యక్తులు, వస్తువులు కనిపిస్తే సమాచారం ఇవ్వాలని సూచనలు జారీ చేస్తున్నారు. ట్రాఫిక్ కూడళ్ల వద్ద మైకుల్లో ప్రకటనలు చేస్తున్నారు.
ఇప్పటికే దిల్‌సుఖ్‌నగర్ జంట పేలుళ్లతో భయభ్రాంతులకు గురైన హైదరాబాదీలు ఇప్పుడు మరో దాడి అంటే వణికిపోతున్నారు. అప్పట్లో నిఘా హెచ్చరికలను పట్టించుకోలేదన్న ఆరోపణలు రావడంతో ఈసారి పోలీసులు మరింత డేగకన్ను వేశారు. గత నెల జరిగిన బాంబు దాడి నేపథ్యంతో నగరమంతా తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు తాజా హెచ్చరికలతో మరింత క్షుణ్ణంగా అన్ని పరిశీలిస్తున్నారు. ఇటు నగరవాసులు కూడా తమ బాధ్యతగా జాగ్రత్తగా ఉండాలని, పోలీసులకు సహకరించాలని సూచిస్తున్నారు.











