తీహార్ టు హైదరాబాద్
- Details
- Category: రాష్ట్రీయం
-
02 Mar 2013
- Published on Saturday, 02 March 2013 09:32
దిల్‌సుఖ్‌నగర్ జంట పేలుళ్ల ఘటనపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) వివిధ కోణాల్లో దర్యాప్తు ముమ్మరం చేసింది. పేలుళ్లలో స్వయంగా పాల్గొన్నట్టుగా అనుమానిస్తున్న ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) ఉగ్రసంస్థ కీలక నేత యాసిన్ భత్కల్‌కు అత్యంత సన్నిహితులైన ఇమ్రాన్‌ఖాన్, సయిద్ మక్బూల్‌లను ఢిల్లీ తీహార్ జైలు నుంచి శుక్రవారం విమానంలో హైదరాబాద్‌కు తీసుకువచ్చారు. పుణెలో పేలుళ్ల కేసులో గత ఏడాది సెప్టెంబర్‌లో వీరు అరెస్టయ్యారు. జంట పేలుళ్లకు సంబంధించి కీలక సమాచారం రాబట్టేందుకు ఐదు రోజులపాటు వారిని విచారించనున్నారు. ఈ సందర్భంగా ఎన్‌ఐఏ కార్యాలయం వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటుచేశారు. ఇమ్రాన్, మక్బూల్‌లను విచారిస్తున్నామని ఎన్‌ఐఏ ఐజీ రవిశంకర్ అయ్యన్నార్ సాక్షికి తెలిపారు. శుక్రవారం ఉదయం బేగంపేటలో ఉన్న ఎన్‌ఐఏ కార్యాలయానికి వారిని తీసుకువచ్చారు. అక్కడే ఇద్దర్నీ వేర్వేరుగా విచారిస్తున్నారు. దిల్‌సుఖ్‌నగర్‌లో పేలుళ్లకు పాల్పడింది ఇండియన్ ముజాహిదీన్‌కు చెందిన యాసిన్ భత్కల్ మాడ్యూలేనని దర్యాప్తు సంస్థలు ఇప్పటికే నిర్ధారణకు వచ్చాయి.
ఎన్‌ఐఏ కూడా ఈ మేరకు కేంద్ర హోంశాఖకు ప్రాథమిక నివేదిక సమర్పించింది. ఈ నేపథ్యంలోనే పేలుళ్లకు మూలాలెక్కడ?, సహకరించిన స్థానికులెవరు?, పేలుళ్ల తర్వాత నిందితులు ఎలా తప్పించుకున్నారు... అనే కోణంలో వారినుంచి సమాచారం రాబడుతున్నారు. పేలుళ్లు జరిపేందుకు దిల్‌సుఖ్‌నగర్‌లో రెక్కీ నిర్వహించినట్లు ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసుల విచారణలో మక్బూల్ వెల్లడించాడు.
దీంతో పేలుళ్ల కోసం యాసిన్ ఎవరెవర్ని ఉపయోగించాడనే కోణంలో కర్ణాటకకు చెందిన ఇమ్రాన్, హైదరాబాద్‌కే చెందిన మక్బూల్‌ల నుంచి ఎన్‌ఐఏ బృందాలు వివరాలను సేకరిస్తున్నాయి. పేలుళ్లు జరిగినప్పటి వీడియో దృశ్యాలను చూపించి అనుమానితుల సమాచారం రాబట్టేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. హైదరాబాద్‌లో మకాం వేసి పేలుళ్లు సృష్టించిన యాసిన్ ఎలా తప్పించుకున్నాడో ఆరా తీస్తున్నాయి. అలాగే ఉత్తరప్రదేశ్ అజాంగఢ్‌కు చెందిన యాసిన్ అనుచరులు తబ్‌రేజ్, పకార్ అలియాస్ అహ్మద్, మంజర్‌ల పాత్రపై కూడా అధికారులు వీరిని ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. తబ్‌రేజ్, యాసిన్‌తో కలిసి పేలుళ్లలో స్వయంగా పాల్గొన్నట్లు ఎన్‌ఐఏ దర్యాప్తులో తేలింది. మరోవైపు ఎన్‌ఐఏ కౌంటర్ ఇంటెలిజెన్స్ సహకారం కూడా తీసుకుంటోంది. మక్బూల్ నగరంలో నిర్వహించిన కార్యకలాపాలపై కౌంటర్ ఇంటెలిజెన్స్ వద్ద విస్తృతమైన సమాచారం ఉంది. దిల్‌సుఖ్‌నగర్ పేలుళ్ల అనంతరం నగరంలో కొంతమంది అనుమానితులను స్థానిక పోలీసులు విచారించారు. దీంతో స్థానిక పోలీసులతోనూ ఎన్‌ఐఏ సమన్వయంతో వ్యవహరిస్తోంది. తీహార్ జైల్లో ఉన్న మక్బూల్‌ను హైదరాబాద్‌కు చెందిన 12 మంది యువకులు కలిసినట్టుగా దర్యాప్తులో తేలిన నేపథ్యంలో.. పేలుళ్లతో వీరికేమైనా సంబంధాలున్నాయా? అనే కోణంలోనూ ఎన్‌ఐఏ దర్యాప్తు కొనసాగిస్తోంది. ఎల్‌బీ నగర్ ఏసీపీ అమరేందర్‌రెడ్డి, మలక్‌పేట ఏసీపీ ఇక్బాల్‌సిద్ధిఖీలు శుక్రవారం మధ్యాహ్నం తరువాత ఎన్‌ఐఏ కార్యాలయానికి వచ్చారు.
బాంబుల తయారీ నేర్పిన మక్బూల్: అత్యంత శక్తివంతమైన బాంబుల తయారీలో (ఐఈడీ పరిజ్ఞానం) మక్బూల్‌కు మంచి అనుభవం ఉన్నట్లు ఎన్‌ఐఏ దర్యాప్తులో బయటపడింది. స్థానికంగా కొందరు యువకులకు ఈ మేరకు మక్బూల్ శిక్షణ ఇచ్చినట్లు అధికారులు గుర్తించారు. జంట పేలుళ్లకు ఉపయోగించిన రెండు బాంబులూ స్థానికంగా తయారైనవేనని ఫోరెన్సిక్ నిపుణుల విశ్లేషణలోనూ తేలిన విషయం తెలిసిందే. దీంతో మక్బూల్ ద్వారా శిక్షణ పొందిన యువకులే బాంబులు తయారుచేసినట్లుగా ఎన్‌ఐఏ అనుమానిస్తోంది. వీరెవరు?, సైకిళ్లను రెండు కూడళ్లకు తీసుకెళ్లి పెట్టిందెవరు? గుర్తించగలిగితే సగం కేసును ఛేదించినట్లేనని అధికారులు భావిస్తున్నారు. పేలుళ్ల ప్రాంతంలో సేకరించిన ఆధారాలను విశ్లేషిస్తున్న ఫోరెన్సిక్ నిపుణుల బృందంతో డీజీపీ వి.దినేష్‌రెడ్డి శుక్రవారం సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (ఏపీఎఫ్‌ఎస్‌ఎల్)కి స్వయంగా వెళ్లి...పేలుడు ఘటనాస్థలి నుంచి సేకరించిన నమూనాలను పరిశీలించారు.
ఇండియన్ ముజాహిదీన్‌పైనే కేసు: ఎన్‌ఐఏ డీఐజీ
జంట పేలుళ్లకు సంబంధించి ఇమ్రాన్, మక్బూల్‌ను విచారిస్తున్నట్లు ఎన్‌ఐఏ ఐజీ రవిశంకర్ అయ్యన్నార్ శుక్రవారం రాత్రి విలేకరులకు తెలిపారు. ఇండియన్ ముజాహిదీన్ నేతృత్వంలోనే పేలుళ్లు జరిగినట్లుగా ఎన్‌ఐఏ ఇప్పటికే కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. పేలుళ్లతో ఇమ్రాన్, మక్బూల్‌ల సంబంధాలపై ఆరా తీస్తున్నామన్నారు. నేరం జరిగిన ప్రాంతానికి వీరిద్దరినీ తీసుకెళ్లి విచారించే అవకాశం ఉందని కూడా చెప్పారు. ఈ కేసును ఎన్‌ఐఏకే అప్పగించాల్సిందిగా కేంద్ర హోం శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసిందని రవిశంకర్ ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.











