ప్రకాశం జిల్లాలో పోలీసుల దాష్టికం
- Details
- Category: రాష్ట్రీయం
-
24 Dec 2012
- Published on Monday, 24 December 2012 09:47
ప్రకాశం జిల్లా కొత్తపట్నం పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. బీచ్ కెళ్లి తిరిగి వస్తున్న నవ దంపతులపై తమ ప్రతాపం చూపారు. ఒంగోలు బివియస్ హాల్ సెంటర్‌కు చెందిన గౌతమ్ గాంధీ దంపతులు కొత్తపట్నం బీచ్ కెళ్లి తిరిగి వస్తుండగా.. అల్లూరు వద్ద బైక్ అదుపుతప్పి కిందపడిపోయారు. అయితే అటుగా వస్తున్న పోలీసులు వారికి సహాయం అందించటం మానేసి వారిని ప్రేమికులుగా భావించి గౌతమ్ గాంధీపై చేయి చేసుకున్నారు.
ఇదేంటని ప్రశ్నించినందుకు ఇష్టమొచ్చినట్లు చితకబాదారు. ఈ ఘటనలో అతని కంటికి తీవ్ర గాయం అయ్యింది. అటుగా వచ్చిన స్థానికులు వారికి సహాయం అందించారు. తప్పు తెలుసుకున్న ఖాకీలు చివరకు బాధితుడిని ఒంగోలు రిమ్స్కు తరలించారు. ఈ వ్యవహారంపై ప్రశ్నించిన మీడియా ప్రతినిధులపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారు.
బాధితులనే అడగండి అంటూ ఎదురు దాడికి దిగారు. కాగా ఒంగోలు సీఐ శ్రీకాంత్ బాధితుల్ని పరామర్శించారు. కొత్తపట్నం పోలీసులపై ఉన్నతాధికారులకు సమాచారం అందించినట్లు తెలిపారు. వారిపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని చెప్పారు.











