మార్చి 11 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు
- Details
- Category: రాష్ట్రీయం
-
24 Dec 2012
- Published on Monday, 24 December 2012 09:34
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరిలో కాకుండా మార్చిలో జరగనున్నాయి. కేంద్ర బడ్జెట్ విధానాన్ని అవలంభించాలని ప్రభుత్వం నిర్ణయించడంతో మార్పులు తప్పలేదు. ఈ బడ్జెట్ విధానం వచ్చే ఆర్ధిక సంవత్సరం అమల్లోకి రానుంది.రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి రెండో వారంలో బడ్జెట్ సమావేశాలను ప్రారంభించి మార్చి నెలాఖరుతో ముగిస్తుంది. ఈసారి కేంద్ర ప్రభుత్వం తరహా బడ్జెట్ విధానాన్ని అమలు చేయనున్నందున అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను మార్చి 11న ప్రారంభించాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ, సమాధానం పూర్తి అయిన తర్వాత మార్చి 15న ఆర్థికమంత్రి బడ్జెట్‌ను అసెంబ్లీకి సమర్పిస్తారు. పూర్తి స్థాయి బడ్జెట్‌ను సమర్పించినప్పటికీ తొలి మూడు నెలలకు ఓటాన్ అకౌంట్‌కు అసెంబ్లీ ఆమోదం పొందనున్నారు. సాధారణంగా ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికలకు ముందు ప్రవేశపెడతాయి. అయితే ప్రస్తుతం పార్లమెంటరీ స్థాయి సంఘాల మాదిరే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కూడిన పది స్థాయి సంఘాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దీంతో వచ్చే ఆర్థిక సంవత్సరానికి అధికారులు రూపొందించిన బడ్జెట్‌ను స్థాయి సంఘాలు అధ్యయనం చేసి తగిన సూచనలు, సలహాలు ఇవ్వనున్నాయి. అనంతరం పూర్తి స్థాయి బడ్జెట్‌కు అసెంబ్లీ ఆమోదం తెలపనుంది. బడ్జెట్‌పై సాధారణ చర్చ వారం రోజుల పాటు కొనసాగుతుంది. ఆ తర్వాత మార్చి 26 లేదా 28న మూడు నెలలకు ఓటాన్ అకౌంట్‌కు ఆమోదం పొందుతారు. అనంతరం అసెంబ్లీని వాయిదా వేయనున్నారు. ఈ వాయిదా కాలంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కూడిన పది కమిటీలు 40 అంశాలను పూర్తి స్థాయిలో అధ్యయనం చేస్తాయి. ఏ రంగంలోనైనా నిధుల కేటాయింపు, వ్యయాల్లో మార్పులు చేయాలా..? ఏమైనా పథకాలకు నిధులు కేటాయింపులు పెంచాలా.. ? అనే అంశాలను అధ్యయనం చేసి ప్రభుత్వానికి తగిన సూచనలు, సలహాలు ఇస్తాయి. దీనిపై ఏప్రిల్ చివరి వారం నుంచి మే వరకు అసెంబ్లీ సమావేశమై చర్చించనుంది. మే నెలాఖరులోగా పూర్తి స్థాయి బడ్జెట్‌కు ఆమోదం తెలుపుతారు.











