రుణ మాఫీ.. స్కామ్!
- Details
- Published on Wednesday, 06 March 2013 12:26
యూపీఏ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన రూ.52 వేల కోట్ల పంట రుణ మాఫీ పథకం కూడా ఓ కుంభకోణమేనా? ఈ పథకంపై కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) విడుదల చేసిన నివేదిక చూస్తే ఈ అనుమానాలే వస్తున్నాయి. పథకం అమలులో అక్రమాలే కనిపిస్తున్నాయని కాగ్ పేర్కొంది. వేల మంది అనర్హులు ఈ పథకం కింద లబ్ధి పొందారని, అదే సమయంలో అర్హులైన వేలాది మందికి ఈ పథకం వర్తింపజేయలేదని విమర్శించింది. ‘వ్యవసాయ రుణ మాఫీ, పరిహార పథకం(ఏడీడబ్ల్యూడీఆర్‌ఎస్)-2008’పై కాగ్ తన పరిశీలనా నివేదికను మంగళవారం పార్లమెంటుకు సమర్పించింది. ఈ పథకం కింద 3.69 కోట్ల మంది చిన్న, సన్నకారు రైతులు, 60 లక్షల మంది ఇతర రైతులు లబ్ధి పొందారు. దీనిపై కాగ్ నివేదికలో ముఖ్యాంశాలు..
పథకం అమలులో మార్గదర్శకాలు ఉల్లంఘించారు. ఉదాహరణకు ఓ ప్రవేటు షెడ్యూల్ కమర్షియల్ బ్యాంకు.. మైక్రో ఫైనాన్స్ సంస్థలకు ఇచ్చిన రూ.164 కోట్ల రుణాన్ని రీయింబర్స్ చేశారు.
రికార్డుల తారుమారు చేయడం, అధికంగా రుణాల లెక్కింపు, రాసిన లెక్కలే మళ్లీ రాయడం సహా పలు అవకతవకలకు పాల్పడినట్లు ప్రాథమిక ఆధారాలున్నాయి. ఆర్థిక శాఖలోని ఆర్థిక సేవల విభాగం ఈ పథకం అమలును పర్యవేక్షించింది. రుణ మాఫీ అధికంగా ఉన్న రాష్ట్రాల్లో పరిస్థితిపై ఈ విభాగం ఆరా తీయాల్సి ఉన్నప్పటికీ అలా చేయలేదు.
రుణమాఫీకి సంబంధించి తొమ్మిది రాష్ట్రాల్లో 9,334 ఖాతాలను నమూనాగా తీసుకొని పరిశీలిస్తే.. 1,257 ఖాతాలు(13.46 శాతం) రుణ మాఫీకి అర్హత ఉన్నప్పటికీ.. ఆ రైతులను అర్హుల జాబితాలో చేర్చలేదని తేలింది. వారికి దక్కాల్సిన రుణ మాఫీ దక్కకుండా చేశారు. మిగతా 80,299 ఖాతాలకు రుణ మాఫీ లేదా పరిహారం అందింపజేశారు. వాటిలోని 8.5 శాతం కేసుల్లో వాస్తవానికి ఆ లబ్ధిదారులు ఈ పథకం కింద మాఫీ పొందడానికి అనర్హులు. మొత్తం మీద నమూనాగా పరిశీలించిన కేసుల్లోనే 22.32 శాతం అక్రమాలని తేలింది.
రికార్డులను తారుమారు చేసిన కేసుల్లో సంబంధిత బ్యాంకు అధికారులు, అంతర్గత ఆడిటర్లు, సెంట్రల్ స్టాట్యుటరీ ఆడిటర్లపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలి. మైక్రో ఫైనాన్స్ సంస్థలకు, అనర్హులకు వర్తింపజేసిన రుణ మాఫీని రద్దు చేసిన సొమ్ము రికవరీ చేయాలి.
‘సీబీఐ దర్యాప్తు జరిపించాలి’
రుణ మాఫీ పథకం మొత్తం ఒక కుంభకోణమని బీజేపీ మంగళవారం ఆరోపించింది. ఈ కుంభకోణంలో రూ.10 వేల కోట్ల మేర అక్రమాలు జరిగాయని పేర్కొంది. దీనిపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేసింది. కాగా, బీజేపీ ఆరోపణలను కాంగ్రెస్ తోసిపుచ్చింది. ఎన్‌డీఏ హయాంలోనూ వివిధ శాఖలు, పథకాల అమలు తీరుపై కాగ్ నివేదికలు వచ్చేవని కాంగ్రెస్ ప్రతినిధి రషీద్ అల్వీ వ్యాఖ్యానించారు.











